ఇదియె తెనుంగు దేశ మిట నే మహనీయ గుణాఢ్యు లూనిరో
పదముల, నే నిలింపులు కృపారస దృక్కుల నిందు నిల్పిరో
కదనము నందు నే మగలు గర్జిలిరో నిట శౌర్యతేజులై
మది పులకించు నీ పుడమి మట్టియ వాసన జూచినంతనే
ఏ ధన్యు లిచ్చోట సాధనల్ సలిపిరో
దివ్యానుభూతుల దేహ మడరు
ఏ వీరు లిచ్చోట గావించిరో పోరు
వైరి గుండెల సద్దు మారుమ్రోగు
ఏ గణ్యు లిచ్చోట వాగర్థముల గూర్చి
పాడిరో యెదపొంగి పరవశించు
ఏ శిల్పు లిచ్చోట హృదయంబు నిల్పిరో
రాతిగుండెల ననురక్తి నిండు
కనగ నే కవులు మనోజ్ఞ కావ్యములను
వ్రాసిరో నిట శ్రేష్ఠమై వాసికెక్క
తనరి రసవృష్టిలో నెద తడిసిపోవు
చేరి ప్రతిసృష్టిలో మది సేదతీరు
గిరి తలవంచి మ్రొక్కెనట కేవల శంభు సమాను మాన్యు నే
పరమ తపోధనుండు ఘన వార్ధిని గ్రోలెను నొక్కగ్రుక్క నా
వరముని కుంభసంభవుడు పావనుడై నడయాడె నిచ్చటన్
తరుణ శశాంకమౌళి పురి దక్షిణ కాశిక దక్షవాటికన్
అరయగ వింగడించె శ్రుతు లందరు నేర్చి తరింప మేధినిన్
గురువుగ ఖ్యాతికెక్కె మది కోరి రచించె పురాణ సంహతుల్
పరుడగు బాదరాయణుడు పావనుడై నడయాడె నిచ్చటన్
వర యలివేణి వాణి పురి బాసర నా వెలుగొందు స్థానమున్
ఏ దివ్యక్షేత్రాన యినకుల తిలకుండు
భక్తితో పూజించె పరమశివుని
ఏ పుణ్యసీమలో నైదు లింగము లుంచి
కొలిచిరి గణ్యులౌ కుంతిసుతులు
ఏ దివ్యధామమం దాదిశంకరు వాణి
వేదాంత దుందుభుల్ వినగ మొరసె
ఏ తపోభూమిలో ప్రీతితో భ్రమరాంబ
స్వప్నమం దగుపించె ఛత్రపతికి
అదియె శ్రీ మల్లికార్జునుం డాదరమున
సాక్షి గణపతి కొలువంగ మోక్షమొసగ
వెలది భ్రమరాంబ సహితుడై వెలిసినట్టి
క్షేత్రరాజంబు శ్రీశైల గిరివరంబు
శ్రీ కృష్ణరాయలు సేవించి మ్రొక్కిన
కరివేల్పు డున్నట్టి ఘన నగమ్ము
సంకీర్తనాచార్యు డంకిత హృదయుడై
కీర్తించు హరి వెల్గు క్షితిధరమ్ము
కొలిచిన భక్తుల కొంగు బంగారమ్ము
ఏడుకొండల స్వామి యేలు పురము
పిలిచిన పలికెడు కలియుగ దైవంబు
కొలువైన వసుధ వైకుంఠ పురము
శ్రీనివాసుండు వేంకట శిఖరి విభుడు
ఇలను నలివేలు మంగతో వెలసినట్టి
పరమ వైష్ణవ ధామంబు హరిపురంబు
స్తోత్రనీయంబు తిరుమల క్షేత్రవరము
కొలువై యుండెను రామభద్రు డిచటన్ గోదావరీ తీరమున్
చెలియౌ జానకి యంకసీమ వెలయన్ సేవింప సౌమిత్రి తా
పొలుపౌ భక్తిని రామదాసు కొలువన్ పూజింపగా సర్వులున్
నెలవై ముక్తికి విష్ణుధామ మనగా నిగ్గారు భద్రాద్రిలో
రంకె వేసి లేచి రాజమౌళిని గొల్వ
వచ్చు నంది యనెడు భ్రాంతి నొసగు
విందు గొలుపు శిల్ప సౌందర్యమునకు లే
పాక్షి వెలయు నిచట సాక్షి గాను
కాకతీయుల శౌర్య గాధల మార్మ్రోగు
పౌరుషమ్ముల కిల్లు ఓరుగల్లు
రాణి రుద్రమదేవి రణ కౌశలము దెల్పు
వైరి గుండెల ముల్లు ఓరుగల్లు
మధురమౌ శిల్పాలు మలచిన కోవెలల్
హొయలద్ద భాసిల్లు నోరుగల్లు
మూడు కోటలు గల్గి చూడ చక్కగ మించు
జోరైన హరివిల్లు ఓరుగల్లు
తెలుగు జాతికి చిహ్నమై వెలుగు కీర్తి
తోరణమ్ముల శోభిల్లు నోరుగల్లు
తెలుగు వీరుల శౌర్యముల్ దేజరిల్లు
యుచ్ఛ చరితకు సాక్ష్యమీ యోరుగల్లు
అడుగడుగున తీర్థంబులు
అడుగడుగున కోటలుండు నడవులు నదులున్
అడుగడుగున గుడులుండును
కడు వేడుక తెలుగునాట నుడువగ తరమే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి