వచ్చె వసంత శోభ నవ పల్లవముల్ చిగురింప నెల్లెడన్
తెచ్చె లతాంత సౌరభము తెమ్మెరలందున నింపి గొంతుకల్
విచ్చుచు పాడె కోయిలలు పేరిమి నాడె మయూర సంఘముల్
అచ్చపు హాయితో మనె విహంగ చతుష్పద వృక్ష సంతతుల్
ఎచ్చట హాయి మానవున కిచ్చకు వచ్చిన రీతి మెల్గుచున్
ముచ్చటకైన నీ ప్రకృతి మోదము నెంచక స్వార్థచిత్తుడై
మ్రుచ్చిలి పృథ్వి సంపదలు రోగముచే నశియించి నేడిటన్
చచ్చుచు నున్నవాడు మరుజన్మకు నైనను విచ్చునో కనుల్
తుచ్ఛము స్వార్థ చింతనము తోడయి వచ్చు నుదార కర్మముల్
వచ్చు తరమ్ము మెచ్చు యనవద్య చరిత్రము గల్గి మేదినిన్
పచ్చదనమ్ము పెంచి పశుపక్షుల జీవుల గాచి ప్రేమతో
మచ్చను బాపుకొమ్ము మనుమార్గము నందు చరించి మానవా!
మెచ్చు సుదర్శనాయుధుడు మేలు శుభంబుల నిచ్చు ప్రీతితో
వ్రచ్చు సమస్త దోషముల వాలిన ప్రేమ ననుగ్రహించు బల్
హెచ్చిన సంపదల్గలుగు నిచ్చలు తీరు నశించు దైన్యముల్
సచ్చరితాత్ముడై మనుము సాంతము చక్కబడంగ నిక్కమై
నవ వర్షంబుదయించె నేడు జగతిన్ నవ్యాంశువుల్ జిమ్ముచున్
కవితా గాన సుధా రసంబు లొలికెన్ కర్ణప్రమోదంబుగా
అవరోధంబుల దాటి ధాత్రి నడచెన్ అభ్యున్నతిన్ కోరుచున్
ప్లవ నామంబున వెల్గె వత్సరము తా ప్రత్యూష భాసోగతిన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి