17, ఏప్రిల్ 2011, ఆదివారం

మా ఇలవేల్పు ముదిగెరే శ్రీ చెన్నకేశవస్వామి దివ్య చరణారవిందములకు

శ్రీకమలాక్ష! నీదు పదసేవనొసంగి ప్రభాకరేందు తే                   
జోకర రూపమున్గనులఁ జూడగనిల్చి దిగంతమెల్లడన్
ప్రాకటమైన నీదు మధురామృతనామ మొసంగినావు శౌ
రీ! కరుణాలయా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 1


పంచనఁ జేరు గోపికల భాగవతాత్ముల తాపసేంద్రులన్                   
సంచిత పాపరాశి భవసాగరమున్ తరియింపఁ జేసి నీ
యంచిత పాదపంకజ సమాశ్రయమిచ్చుచుఁ బ్రోచురీతి పా
లించు ననున్ హరీ! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 2


ఒఱగును లోకమంతయును నొద్దిక నీ భుజమండలమ్ముపై
ఒఱిగితివీవటంచుఁ మము హోమములెన్నియొ జే
సిఁ బుణ్యముల్
తఱుఁగని రీతిఁ బొందగ నుదారత జేసెడు నీదు లీల లే
రెఱిఁగెడి వారలో! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 3


మించెడు గౌరవంబు శృతిమించెడు హేళన న్యూన భావముల్
ఎంచగరాని సంపదలు హింసలొసంగెడి లేమి కష్టముల్
వంచగరాని మాయలజవందితఁ ద్రుంచు కృపేక్షణంబు సా
రించి నలేక్షణా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 4 


మును వనజాసనుండు తన మూలమెరుంగగ నెంచిఁ బోయినన్
కనుగొనజాలడయ్యె చిరకాలము తామరతూటివెంట తా
ననితర భక్తియోగమున నచ్యుతఁ! జేరెను నీ పదంబులన్
ఘనమగు భక్తిఁగాక నినుఁ గానగ శక్యమె చెన్నకేశవా! - 5


రాతిని నాతిఁ జేసితివి ప్రాణముఁ బోసి దయార్ద్రబుద్ధితో
కోతికనుగ్రహించితివి కోరక బ్రహ్మపదంబు ప్రేమతో
ప్రీతిగ
నెంచితా యుడుత ప్రేమను సేవయు, నమ్ము మమ్మునే
రీతిగఁ బ్రోతువో! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 6


ఉగ్రత దుష్టదానవుని యుక్కడగించి ప్రసన్నవీక్షణా
నుగ్రహలీల దానవతనూజుని ప్రేమ నృసింహమూర్తివై
అగ్రసుపూజ్య! బ్రోచుగతి నంతముఁ జేయుమఘంబు లాగ్రహా
నుగ్రహవిగ్రహా!కను మనోహర దృక్కులఁ జెన్నకేశవా!
 - 7 


పిల్లనగ్రోవియే మరుని విల్లయి వేణురవమ్ములమ్ములై 
యుల్లము దోచుచుండ మదినొల్లక నీ విరహమ్ము వేడినన్
గొల్లెతలెల్ల భామినుల
నొక్కరి కొక్కడి వౌచుఁ బ్రోచు నీ
చల్లని చూపులొక్కపరిఁ జల్లుము నాపయి చెన్నకేశవా! - 8


సాక్షివి సర్వజీవులకు సారమ నీవయ వేదరాశికిన్
మోక్షపదంబు నీవయ ముముక్షువుఁ బోదగు దారి నీవె స
ర్వేక్షణ! దర్శనంబిడు ముపేక్షను మాని సహింప నోప శౌ
రీ! క్షణమాత్రమున్ ముదిగెరేపురదేవర చెన్నకేశవా! -9 


అందెలు ఘల్లుఘల్లుమన ఆడెను నందుని నందనుండు వా
తంధయునౌదలమ్ముపయి తాండవనృత్యము! వేగరండు, గో
విందుని నాట్యలీల కనువిందుగఁ జూతుమటంచుఁ జేరువా
రిం దలపోతునో! ముదిగిరేపురదేవర చెన్నకేశవా! - 10 

1 కామెంట్‌:

durgeswara చెప్పారు...

JAI CHENNKESAVAA !