12, అక్టోబర్ 2010, మంగళవారం

సమస్యాపూరణం

సి పి బ్రౌన్ అకాడమి వారి ' సాహితీ స్రవంతి ' త్రైమాసిక సాహిత్య పత్రికలోని సమస్యాపూరణం శీర్షిక కోసం స్వీకరించిన నా పద్యాలు.

సమస్య: దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్
నాకు నచ్చిన వస్తువుతో ఒకటి, భారతార్థంతో ఒకటి.

పున్నెముఁ జేసినాము సుమి భూమిని ధేనువుఁ జేసి పిండె యా
పన్నశరణ్యుడా పృథువు పాలకు మారు సమస్త వస్తువుల్
మన్నన సేసె మా మనవి మానుము శోకము చాలు కర్షకా,
దున్నకు! దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్

ఎన్నడులేని ప్రేమలివి ఎచ్చటనుండి జనించె కౌరవుల్
నిన్నును నన్ను తమ్ములను నేడిటు పంపిరి తల్లి తోడుగా
చెన్నగు వారణావతము చెల్వగు తీరు యుధిష్ఠిరా, కనన్
దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్!

(రెండవ పద్యంలో యుండిన గణ,యతి దోషాలు ప్రచురణకర్తలు, నేనూ చూసుకోలేదు. వాటిని సవరించి వ్రాశాను.)

2 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

చాలా బాగున్నాయి మీ పూరణలు. మహదానందం కలిగింది.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శంకరయ్య గారూ, మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదములు.