28, డిసెంబర్ 2022, బుధవారం
31, అక్టోబర్ 2021, ఆదివారం
ఆధునిక కవులు
పరుగుల్దీయుచు సాగు నాంధ్ర కవితా భాగీరథీ సంసృతిన్
గరిమన్బొంగు తరంగ శృంగము లనన్ గణ్యంబులౌ కావ్యముల్
పరిషేషించు మనోజ్ఞ భావ సుధలన్ ప్రాంచన్మనో భూములన్
విరియన్జేయుచు రమ్య భావ సుమముల్ విభ్రాజమానంబుగా
ఆగక సాగెడి నదమున
నే గతి క్రొంగొత్త నీర మేర్పడ జేరున్
జాగృత వాఙ్మయ మందున
నా గతి క్రొంగొత్త రచన లగుపించునయా!
ఆదిన్ భావ కవిత్వమున్ దెలుగులో నారంభమున్ సేయుచున్
పాదుల్ సేసితివోయి నవ్య కవితా సంప్రాజ్య కేళీవనిన్
దేదీప్యంబుగ నింపినావు హృదులన్ దేశాభిమానంబులన్
హ్లాదంబౌను తలంప నిన్ను మది రాయప్రోలు సుబ్బాన్వయా
కలమున్ జేకొని వ్రాసినావొ కవితల్--కాదోయి నీ గుండెలో
వెలిగే కోమల భావముల్ కరుణయున్ ప్రేమానురాగంబులున్
వలపుల్ నింపుచు వ్రాసినావు సుకవీ--భాసిల్లె మా డెందముల్
జలముల్ నిండును కంటిలో చదువగా జంధ్యాల నీ కావ్యముల్
పెక్కు యమూల్య రత్నముల పెన్నిధి జిక్కిన రీతి దోచు--నీ
యొక్కని కావ్యముల్ నవల లొప్పగు పాటల జూడ--నన్నిటన్
మక్కువగా తెనుంగు పద మాధురి నింపి రచించినావు--లే
డెక్కడ విశ్వనాథ సుకవీ నిను బోలు కవీంద్రు డీ మహిన్
చిన్నతనాన నే మతి రచించితివో పెనుగొండ లక్ష్మి--నా
డున్నతి నెట్లు బాడితి వహో శివతాండవ--మా ప్రభావముల్
గ్రన్నన మెచ్చినారు సమకాలపు సత్కవు లైనవారు--నిన్
సన్నుతి సేతునోయి మది శారద పుత్రుని పుట్టపర్తినిన్
శృంగారారజ రమ్యపద్య కవితా స్త్రీరత్నమున్ వీడి--యు
త్తుంగస్వైర వచో కవిత్వమను పాథోజానన్ గూడి--యా
క్రుంగే ఖేదన దైన్య జీవుల వ్యథల్ క్రుంగింపగా పాడి--వా
సింగాంచేవు గదా సదా జనులలో శ్రీశ్రీ! ధరన్ జూడగా
షెల్లీ బోలు కవీంద్రుడా నిను ప్రశంసించేరు విద్వత్కవుల్
ఉల్లేఖింతు సినీ కవిత్వమున నీ యుఱ్ఱూత లూచే కృతుల్
మళ్ళీ రాని యపూర్వ చిత్రమన నే మల్లీశ్వరిన్ నెంచెదన్
ఉల్లాసంబున కృష్ణశాస్త్రి నిను నా యుల్లంబునన్ నింపెదన్
కలగున్ డెందము గబ్బిలంబను కృతిన్ గన్పట్టు నిష్ఠూరమౌ
సెలవుల్ జూచిన--మాదు మానసములన్ చిప్పిల్లు కారుణ్యముల్
తలపోతున్ పిరదౌసి యాదిగ మదిన్ దాక్షిణ్యముల్ నింపు--నీ
వెలలేనట్టి యనన్య కావ్యముల సంప్రీతంబుగా జాషువా
ఒకరిని మించిన సత్కవు
లొకరిట గలరయ్య గణ్యు లుత్తములు ఘనుల్
ఒకరొకరి నాధునికులను
అకలంక మనంబు తోడ నందర తలతున్
తెలుగునాట దర్శనీయ స్థలాలు
13, ఏప్రిల్ 2021, మంగళవారం
వచ్చితివా ప్లవా!
వచ్చె వసంత శోభ నవ పల్లవముల్ చిగురింప నెల్లెడన్
తెచ్చె లతాంత సౌరభము తెమ్మెరలందున నింపి గొంతుకల్
విచ్చుచు పాడె కోయిలలు పేరిమి నాడె మయూర సంఘముల్
అచ్చపు హాయితో మనె విహంగ చతుష్పద వృక్ష సంతతుల్
ఎచ్చట హాయి మానవున కిచ్చకు వచ్చిన రీతి మెల్గుచున్
ముచ్చటకైన నీ ప్రకృతి మోదము నెంచక స్వార్థచిత్తుడై
మ్రుచ్చిలి పృథ్వి సంపదలు రోగముచే నశియించి నేడిటన్
చచ్చుచు నున్నవాడు మరుజన్మకు నైనను విచ్చునో కనుల్
తుచ్ఛము స్వార్థ చింతనము తోడయి వచ్చు నుదార కర్మముల్
వచ్చు తరమ్ము మెచ్చు యనవద్య చరిత్రము గల్గి మేదినిన్
పచ్చదనమ్ము పెంచి పశుపక్షుల జీవుల గాచి ప్రేమతో
మచ్చను బాపుకొమ్ము మనుమార్గము నందు చరించి మానవా!
మెచ్చు సుదర్శనాయుధుడు మేలు శుభంబుల నిచ్చు ప్రీతితో
వ్రచ్చు సమస్త దోషముల వాలిన ప్రేమ ననుగ్రహించు బల్
హెచ్చిన సంపదల్గలుగు నిచ్చలు తీరు నశించు దైన్యముల్
సచ్చరితాత్ముడై మనుము సాంతము చక్కబడంగ నిక్కమై
నవ వర్షంబుదయించె నేడు జగతిన్ నవ్యాంశువుల్ జిమ్ముచున్
కవితా గాన సుధా రసంబు లొలికెన్ కర్ణప్రమోదంబుగా
అవరోధంబుల దాటి ధాత్రి నడచెన్ అభ్యున్నతిన్ కోరుచున్
ప్లవ నామంబున వెల్గె వత్సరము తా ప్రత్యూష భాసోగతిన్