నేను వ్రాసిన పెన్నిధి అనే పద్యకావ్యంలోని ఈశ్వరుని దండకం. పుస్తకాన్ని త్వరలో ప్రకటిస్తాను.
శ్రీకంధరా! చంద్రమౌళీ! హరా! లోకరక్షాకరా! పార్వతీశా! పరా! నీదు తేజమ్ము తా దివ్య లింగమ్ముగా నుద్భవింపన్ హృషీకేశు డంభోజ జన్ముండు నా దివ్య తేజంపు మూలమ్ము నంతమ్ము జూడన్ వృథాయత్నముల్ జేయ నాద్యంతముల్ లేని చైతన్య మీవంచు జ్ఞానమ్ము తామొంది రీ సృష్టి వర్తిల్లు కాలమ్ము యా బ్రహ్మకున్ ప్రొద్దుగా నంత కాలమ్ము తా రాత్రిగా నూరు వర్షంబులున్ నిల్చి యా వెన్క కూలన్ కపాలమ్ము హారమ్మునన్ పూసగా యుంచు నీ యాయు వెన్నంగ శక్యంబె కాలాత్మకా! మున్ను దేవాసురుల్ క్షీర పాథోధి ద్రచ్చంగ హాలాహలం బుద్భవింపంగ లోకమ్ము లల్లాడ కారుణ్యముం జూపి క్ష్వేళమ్మునున్ గ్రోలి కాపాడినావే! నియంత్రింప భూతాదులన్ రుద్రభూమిన్ సదా సంచరించేవయా! ఘోర రాత్రించరుండైన చండాలుడైనన్ సదా భక్తితో గొల్వ భేదమ్ము పాటింపకన్ దాసులన్ గాచి నిండైన కారుణ్యమున్ జూపు నీ దివ్య మాహత్మ్యమున్ నెన్న నేనెంత వాడన్ దయాసింధు నా మానసమ్మందు వేదించు ఖేదమ్ములన్ బాపి మార్గమ్ములన్ జూపి మోదమ్ము లన్నీయవే! నన్ను గావంగ నీకన్న దైవమ్ము వేరున్నదే? దీనునిన్ గావు మీశా! గిరీశా! మహేశా! నమస్తే! నమస్తే! నమస్తే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి