4, జులై 2013, గురువారం

తెలుగు భాష!

సి పి బ్రౌన్ సేవా సమితి వారి పద్యరచన పోటీ కోసం రాసిన పద్యాలు. పంపి చాలా కాలమైది. వారి వద్దనుండీ ఎటువంటి సమాచారం లేదు. అందుకే యిక రసజ్ఞులైన బ్లాగ్మిత్రుల ముందుంచుతున్నాను.

పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!

వేదవిహితమైన వీరధర్మము పల్కె
భారతమ్ముననిదే వీర భాష
నలదమయంతుల నలువును పండించె
గారాము చిలుక శృంగార భాష
చిన్ని కృష్ణుని లీలలెన్నెన్నొ కీర్తించె
భాగవతులు మెచ్చ భక్తి భాష
మొల్ల పల్కుల నిల్చి యెల్లవారలు మెచ్చ
రాముని కథజెప్పె రక్తి భాష

హృద్యమగు చమత్కృతి ప్రతిపద్యమందు
నిలిపె తిన్నని కథను కన్నీరు నింపె
భాషలందున పరిపూర్ణమైనభాష
వెలుగు నవరసమ్ముల నాదు తెలుగు భాష!

సార్వభౌములు కవిసార్వభౌముల పల్ల
కీలను మోసి శ్లాఘించినారు
గండపెండేరాలు మెండుగా తొడిగించి
గుండెల ప్రేమలై కురిసినారు
కనకాభిషేకాలు కరమొప్ప సేయించి
కవిశేఖరుల కాళ్ళు కడిగినారు
అర్ధసింహాసనాలర్థింపకనె యిచ్చి
ఆదరమ్మున స్నేహమొదవినారు

ఇట్టి వైభవమ్ములింద్రభోగములిచ్చి
బ్రహ్మరథము పట్టి ప్రస్తుతించు
కవుల కీర్తి నీదు కరుణయే కద తల్లి
దేవి కల్పవల్లి తెలుగుతల్లి!

అది గతవైభవమ్ము మనమందున మాసిన జ్ఞాపకమ్ము మా
హృదయపు లోతుగోడపయి హీనతనొందిన రంగుబొమ్మ యే
పెదవుల పైననైన వినిపించదు నేడు తెనుంగుభాష కా
కుదనపు పాశ్చ్య సంస్కృతుల క్రూర ప్రచండ ప్రభంజనమ్మునన్!

పుట్టిన పాపడో బడికి పోయెడు బాలుడొ పెద్ద విద్దెలన్
పట్టుగ నభ్యసించి పరిభాషణ జేసెడు వక్తయో పనిన్
దిట్టగు కార్యదక్షుడయొ తేటతెనుంగున పల్కు జీవుడి
ప్పట్టున కానరాడు పరభాష ప్రభావ మహత్వమెట్టిదో! 

తంత్రజ్ఞానమునందు తలమానికముగా వి
దేశముల వెలుగు తెలుగువాడు
గానగంధర్వుడై మానసమ్ములనెల్ల
పులకింపజేయును తెలుగువాడు
ఆటపాటల మేటి పాటవమ్మును చాటి
అలరించునెల్లర తెలుగువాడు
అవధానములు వేలు అవలీలగా జేసి
వెలుగొందు భువినందు తెలుగువాడు

తెలుగుతేజమెందు తేజరిల్లగజేసె
తెలుగు కీర్తి చాటె దిశలయందు
తెలివి మాలి నేడు దేదీప్యమానమౌ
తెలుగుభాషకేల తెచ్చె కీడు? 

భాషయె జాతికి జీవము
భాషయె ప్రతిబింబమయ్య ప్రతి సంస్కృతికిన్
భాషయె సమతా చిహ్నము
భాషయె సూత్రమ్ము పగిది ప్రజలను కలుపున్ 

పలుకుమాంగ్లమందు వలదందుమా నిన్ను
భ్రాత! తెలుగుకేల శీతకన్ను?
వన్నెచిన్నెలొలుకు వగలాడి వలపులో
మాతృమూర్తినెట్లు మరతువయ్య? 
 
దిద్దుము తెలుగక్షరమును
ముద్దుగ తెలుగన పలుకుము ముత్తెములొలుకన్
ఉద్ధతినొందును జీవన
మిద్ధరణిని వెలయు కీర్తి యద్దేవి కృపన్!


!!శుభం!!

10 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

తెలుగుభాషా సామర్థ్యాన్ని తేజస్సును ఓజస్సును ప్రస్తుతిస్తూ ప్రస్ఫుటిస్తూ సుమనోహరంగా వెలయించిన పద్యావళి నా మనసుదోచింది!

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ధన్యవాదాలు, సూర్యప్రకాష్ గారూ!

శ్రీలలిత చెప్పారు...


ఛందోబధ్ధవయిన పద్యాలు తేలికగా అర్ధమవుతూ తెలుగుతీపిని చక్కగా పంచుతున్నాయి. చాలా బాగా వ్రాసారు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ధన్యవాదాలండి శ్రీలలితగారూ! పద్యాలు మీకు నచ్చినందుకు సంతోషం.

విరించి చెప్పారు...




మిత్రమా! శ్రీ సూర్య ప్రకాశ్ గారు తెలుగు భాష లోని తీయదనాన్ని గొప్పదనాన్ని అందంగా ఛందో బద్దంగా పరభాషా వ్యామోహులు సైతం ఔరా అనిపించేలా చక్కగా చెప్పారు.


బ్రహ్మ మానస రాణి పరమ పావని వాణి
కరము నందలి వీణ స్వరము రీతి
పూవు పూవున వ్రాలి పుప్పొడి నే గ్రోలి
కొదమ తేటుల దాటు కూర్చినట్టి
మకరంద చందంబు మాధుర్యమే నిండి
మధుర భాషణ తోడ మహిన నిలచి
ముద్ద మందారమై ముత్యాల సొంపుతో
దేదీప్య మానమౌ తెలుగు భాష


మాతృ భాష సేవ మరణించ నీయదు
అమృత పాన సమము అమ్మ భాష
గిడుగు రామమూర్తి గిట్టిన నేమిరా
జనుల యదన నిలిచె ఘనము గాను.

పరభాషా వ్యామోహం పెచ్చు పెరిగిన ఈ రోజుల్లో మీరు తెలుగు తల్లికి ముద్దు బిడ్డనని చాటుకున్నారు, సంతోషం మీకు ధన్యవాదాలు.

--- విరించి
హైదరాబాద్

విరించి చెప్పారు...

శ్రీ సూర్యప్రకాశ్ గారికి అభినందనలు
మీతెలుగు భాష లోని తీయదనాన్ని ఘనతను మీరు ఛందో బద్ధంగా మరింత తీయగా అందించి
మాతృ భాష పట్ల మీకున్న గౌరవాన్ని ప్రేమను చాటుకున్నారు ధన్యవాదాలు
విరించి
హైదరాబాద్ .

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మిత్రమా!
శ్రీ సూర్యప్రకాశ్ గారి పద్యం వాణి చేతిలోని వీణ మ్రోగినంత, కొదమతేటులు కూర్చిన తేనెలంత మధురంగానూ ఉన్నది. అందించినందుకు బహుదా ధన్యవాదములు.

Unknown చెప్పారు...

హృద్యమయిన పద్యం తెలుగువాడి ఆస్తి , సొత్తు!మరేభాషలోనూ లేని పద్యం తెలుగు ఆత్మగౌరవం!తెలుగు భారత రామాయణ భాగవతాలు చదువుతూ లోతుల్లోకి పోతే అన్నం నీళ్ళు మరచి మైమరచిపోతాము!మంచివచనం వ్రాయాలంటే మంచికవిత్వం చదవాలంటారు పెద్దలు!టపాలలో పద్యరచన పరవళ్ళు తొక్కడం అభినందనీయం!ఫణి ప్రసన్నకుమార్,వి.ఎస్ .ఆంజనేయులు శర్మ గారలకు ధన్యవాదములు!

విరించి చెప్పారు...


శ్రీ ఫణి ప్రసన్న కుమార్ గారికి అభినందనలు, తెలుగు భాష లోని తీయదనాన్ని ఘనతను మీరు ఛందో బద్ధంగా మరింత తీయగా అందించి
తెలుగు లోని తీపి ఎంత అని విచారిస్తే అది ప్రసన్న కుమార్ గారి పద్యమంత అని ఉపమానం చెప్పేంత
గొప్పగా చెప్పాoరు, తెలుగు భాష పట్ల మీకున్న గౌరవాన్ని ప్రేమను చూసి ఆ తెలుగు తల్లి మురిసి పోతుంది
విరించి
హైదరాబాద్ .

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మీ అబిమానానికి ధన్యవాదాలు విరించి గారూ! ఐతే మహామహులైన పద్యకవులెందరో అంతర్జాలంలోనే వున్నారు. వారి రచనల ప్రేరణ వల్లనే నా పద్యాలు కొంతైనా మనోరంజకంగా ఉన్నాయి.