3, డిసెంబర్ 2025, బుధవారం

అనంతపురంలో జరిగిన 9వ రాయలసీమ మహాకవిసమ్మేళనంలో నా కవితా గానం...

 




హంపన్న స్మారక చిహ్నము


ఉ|| దుర్గమమైన దుర్గమది దుర్జయమై వెలుగొందె గుత్తి తాఁ

భర్గుని భంగి నిల్చె రిపువర్గము క్రుంగ సమున్నతంబుగా

నిర్గత శాత్రవంబును సునిశ్చలమౌ క్షితిభృత్తు ముందటన్

మార్గము ప్రక్క నిల్చెనొక స్మారక చిహ్నము మానితంబుగా!


ఉ|| స్మారక చిహ్నమో? భరతమాత లలాటపు సిందురమ్మొ? తాఁ

నారిని గౌరవించెడు సనాతన సంస్కృతి బావుటాయొకో?

వైరిగణమ్ము గుండెలను వ్రచ్చెడు ఖడ్గమొ? కాదు కాదిదే

భారత వీర పౌరుల యవారిత శౌర్యపు చిహ్నమే సుమీ!


ఉ|| కన్నును మిన్ను గానక మృగాక్షుల నిద్దర పల్లెకాంతలన్

మన్నన లేక దుర్మతులు మానము దోచగ నాంగ్ల సైనికుల్

వెన్నడిఁ బార వార లతి భీరువులై శరణంచు వచ్చి హం 

పన్నను జేరి దాగి రనవద్య పరాక్రముఁ ధైర్యశాలినిన్


ఉ|| కాపరి రైలు గేటునకు కాచెను కాంతల ప్రాణ మానముల్

చూపెను గుండె వైరులకు సోకగ నీయడు కోమలాంగులన్

పాపపు తెల్లవారల తుపాకుల గుండ్లకు నొడ్డె ప్రాణముల్

చూపుచు వెన్ను పోయిరదె సోలి సిపాయిలు వీడి కాంతలన్


ఉ|| ఖిన్నత జెంది వ్రాసెనిది కేశవ పిళ్ళయి హిందు పత్రికన్

సన్నుతి సేసి గుత్తి ప్రజ స్మారక చిహ్నము కట్టి రంతటన్

ఉన్నతమైన త్యాగమున కుజ్వలమైన నిదర్శనంబు హం

పన్న యనంగ తాఁ జనుల స్వాంతము లందున నిల్చె నిత్యుడై


మ|| భళిరా హంపన! ధన్య మాయె కద యీ ప్రాంతమ్ము నీ జన్మ! నీ

గళమున్ శౌర్యము లొల్కు గర్జనములన్ కంపించు వైరీ హృదుల్

అలరన్ నీ ఘన కీర్తి వెల్గు భువిలో ఆచంద్రతారార్కముల్

తళుకుల్ చిందెడు తారవై నిలువుమా ధైర్యంబు మాకిచ్చుచున్


కం|| ఉన్నతమై యగుపించును

చెన్నుగ మా గుత్తికోట శిఖరము కన్నన్

ఎన్నగ నీ కీర్తి వలనె

అన్నా! నీ స్మారకమ్ము అవనీస్థలిలో!