4, జులై 2013, గురువారం

తెలుగు భాష!

సి పి బ్రౌన్ సేవా సమితి వారి పద్యరచన పోటీ కోసం రాసిన పద్యాలు. పంపి చాలా కాలమైది. వారి వద్దనుండీ ఎటువంటి సమాచారం లేదు. అందుకే యిక రసజ్ఞులైన బ్లాగ్మిత్రుల ముందుంచుతున్నాను.

పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!

వేదవిహితమైన వీరధర్మము పల్కె
భారతమ్ముననిదే వీర భాష
నలదమయంతుల నలువును పండించె
గారాము చిలుక శృంగార భాష
చిన్ని కృష్ణుని లీలలెన్నెన్నొ కీర్తించె
భాగవతులు మెచ్చ భక్తి భాష
మొల్ల పల్కుల నిల్చి యెల్లవారలు మెచ్చ
రాముని కథజెప్పె రక్తి భాష

హృద్యమగు చమత్కృతి ప్రతిపద్యమందు
నిలిపె తిన్నని కథను కన్నీరు నింపె
భాషలందున పరిపూర్ణమైనభాష
వెలుగు నవరసమ్ముల నాదు తెలుగు భాష!

సార్వభౌములు కవిసార్వభౌముల పల్ల
కీలను మోసి శ్లాఘించినారు
గండపెండేరాలు మెండుగా తొడిగించి
గుండెల ప్రేమలై కురిసినారు
కనకాభిషేకాలు కరమొప్ప సేయించి
కవిశేఖరుల కాళ్ళు కడిగినారు
అర్ధసింహాసనాలర్థింపకనె యిచ్చి
ఆదరమ్మున స్నేహమొదవినారు

ఇట్టి వైభవమ్ములింద్రభోగములిచ్చి
బ్రహ్మరథము పట్టి ప్రస్తుతించు
కవుల కీర్తి నీదు కరుణయే కద తల్లి
దేవి కల్పవల్లి తెలుగుతల్లి!

అది గతవైభవమ్ము మనమందున మాసిన జ్ఞాపకమ్ము మా
హృదయపు లోతుగోడపయి హీనతనొందిన రంగుబొమ్మ యే
పెదవుల పైననైన వినిపించదు నేడు తెనుంగుభాష కా
కుదనపు పాశ్చ్య సంస్కృతుల క్రూర ప్రచండ ప్రభంజనమ్మునన్!

పుట్టిన పాపడో బడికి పోయెడు బాలుడొ పెద్ద విద్దెలన్
పట్టుగ నభ్యసించి పరిభాషణ జేసెడు వక్తయో పనిన్
దిట్టగు కార్యదక్షుడయొ తేటతెనుంగున పల్కు జీవుడి
ప్పట్టున కానరాడు పరభాష ప్రభావ మహత్వమెట్టిదో! 

తంత్రజ్ఞానమునందు తలమానికముగా వి
దేశముల వెలుగు తెలుగువాడు
గానగంధర్వుడై మానసమ్ములనెల్ల
పులకింపజేయును తెలుగువాడు
ఆటపాటల మేటి పాటవమ్మును చాటి
అలరించునెల్లర తెలుగువాడు
అవధానములు వేలు అవలీలగా జేసి
వెలుగొందు భువినందు తెలుగువాడు

తెలుగుతేజమెందు తేజరిల్లగజేసె
తెలుగు కీర్తి చాటె దిశలయందు
తెలివి మాలి నేడు దేదీప్యమానమౌ
తెలుగుభాషకేల తెచ్చె కీడు? 

భాషయె జాతికి జీవము
భాషయె ప్రతిబింబమయ్య ప్రతి సంస్కృతికిన్
భాషయె సమతా చిహ్నము
భాషయె సూత్రమ్ము పగిది ప్రజలను కలుపున్ 

పలుకుమాంగ్లమందు వలదందుమా నిన్ను
భ్రాత! తెలుగుకేల శీతకన్ను?
వన్నెచిన్నెలొలుకు వగలాడి వలపులో
మాతృమూర్తినెట్లు మరతువయ్య? 
 
దిద్దుము తెలుగక్షరమును
ముద్దుగ తెలుగన పలుకుము ముత్తెములొలుకన్
ఉద్ధతినొందును జీవన
మిద్ధరణిని వెలయు కీర్తి యద్దేవి కృపన్!


!!శుభం!!