26, సెప్టెంబర్ 2012, బుధవారం

సుందర సుమబాల

మా మరదలి కూతురు చి|| శ్రీ నందన సురి నామకరణ మహోత్సవం సందర్భంగా..

నందనమందున విరిసిన
సుందర సుమబాల చాల సొగసుల మా శ్రీ
నందన సురికిచ్చుత గో
విందుడు కడుప్రేమమీర వేల శుభంబుల్.

22, జులై 2012, ఆదివారం

ఆంధ్ర పాదుకా సహస్రము. శ్రీమద్వేదాంత దేశిక కృతికి ఆంధ్ర పద్యానువాదము

రెండు రోజుల క్రితం నాకు శ్రీ వింజమూరి శేషఫణిశర్మ గారు వ్రాసిన ఆంధ్ర పాదుకాసహస్రము పుస్తకం ప్రతి పోస్ట్ లో అందింది. దానిని చదవటం ప్రారంభించాను. సాహితీబంధువులకు ఈ గ్రంధాన్ని పరిచయం చేద్దామనే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి తొలిపలుకులు 'కరుణవేది ' లో వారి మాటలలో...
"శ్రీరంగనాధస్వామి దివ్య పాదారవిందాలను వర్ణ్యవస్తువుగా గ్రహించి రచించిన స్తోత్ర ప్రబంధ రాజం పాదుకాసహస్రం. సంస్కృత పాదుకాసహస్ర రచయిత శ్రీ మద్వేదాంత దేశికులు.  సహస్ర సంఖ్యలో వెలువడిన మొదటి స్తోత్రం పాదుకాసహస్రమే. అందుకే సంస్కృత వాజ్మయంలో ఈ గ్రంధం ప్రాధాన్యత సంతరించుకొంది. ఇది కొన్ని గంటల వ్యవధిలో అవతరించిన అత్యాశు రచన. ఇంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న ఈ పాదుకాసహస్రాన్ని అనువదించడం శ్రమతో కూడిన పని. ఇందుకు వేదాంతదేశికుల హృదయం బాగా తెలిసినవారై ఉండాలి. కవి హృదయం తెలియడం అంటే మాటలు కాదు. 'యేషాం కావ్యాను శీలన వశాత్....' అనే ఆర్యోక్తి సహృదయుని విషయంలో ఉండనే ఉంది కదా. అలా అనువదించడం అంటే బంగారానికి తావి అబ్బడమే.
ఒకరు చేసిన రంధ్రంలోకి మరొకరు బాణం వెయ్యడమంత కష్టమన్నారు అనువాదరచనను. శర్మగారు ఒకటి కాదు వెయ్యి బాణాలు వేశారు. గురి తప్పకుండా వేశారు. చమత్కారమేమిటంటే, ఇది వీరికి తెలుసు పాఠకులారా! కావలిస్తే బేరీజు వేసుకోండి. అన్నట్టు శ్లోకమూ పద్యమూ ఇచ్చి ఊరుకోకుండా తెలుగు వ్యాఖ్యానాన్ని కూడా పొందుపరిచి మరీ మనకు అందించారు. వీరి ఆత్మప్రయత్నానికి జోహార్! "


శ్రీ వింజమూరి శేషఫణిశర్మ గారు బహు గ్రంధకర్త. వీరు యిదివరలో రఘువంశ తిలక చరితము(పద్యకావ్యం), సూర్యశతక వ్యాఖ్యానము, సుషుమ్న అనే పద్య లఘుకృతులను వ్రాశారు. వీరు పెక్కు కళాశాలలో ఆంధ్రోపన్యాసకులు, సంస్కృతోపాధ్యాయునిగా పనిచేసి 2006 నుండి పుట్టపర్తిలో గౌరవ అధ్యాపకునిగా సేవ చేస్తున్నారు. వీరు సత్యసాయి భక్తులు. ఈ కృతిని వారికే అంకితమిచ్చారు. వీరి కృతి ఈ ఇష్టదేవతాస్తుతితో ప్రారంభమవుతుంది.


శా|| శ్రీసత్యాఖ్యము, విశ్వవంద్యము, జగచ్ఛ్రేయోద, మానందచి
     ద్భాసం, బీస్వరతాది సిద్ధియుత, మస్వాపంబు, విశ్వోపకా
     రాసక్తం, బపవర్గసౌఖ్యద, మనాద్యంతంబు, పర్తీపురా
     వాసంబౌ నల దివ్యతత్వము మదిన్ భాసింతు నశ్రాంతమున్.


కృతిపతి మహిమాభివర్ణనములో ఒక పద్యం.


మ|| ఇలలోనున్న సమస్తజీవులనొకండే యాత్మ భాసిల్లు, లే
     ద లనం బేనియు బేధ, మట్లగుట సత్యప్రేమకారుణ్యశాం
    తుల నన్యోన్యసుఖప్రదాయకులరై దుర్ద్వేషదూరాత్ములై
    మెలగుండంచు వచించి సాయి నడపుం బెక్కండ్ర నీ దారిలోన్.


షష్ట్యంతములలో రెండు పద్యాలు చూడండి.

కం|| ఏతాదృగ్బహుమహిమున
      కాతతభక్తాళిహృత్పుటాంతస్తత్వ
      ద్యోతనమిహిరునకు, గుణా
      తీతునకున్ దర్శనీయదివ్యాకృతికిన్.


కం|| చింతితఫలదాయికి, స
      ర్వాంతర్యామికి, నమేరికాదికబహుఖం
      డాంతరజనవినుతునకు, బ్ర
      శాంతినిలయవాసి సత్యసాయీశునకున్.


ఈ గ్రంధంలో ప్రస్తావన పద్ధతి, సమాఖ్య పద్ధతి, బహురత్న పద్ధతి మొదలుగా ద్వాత్రింశ భాగాలు ఉన్నాయి. ప్రథమ పద్ధతి ఈ పద్యంతో ప్రారంభమవుతుంది.


కం|| శ్రీరంగాధీశచరణ
     నీరేజత్రాణశరణనిజమూర్ధతనుల్
     సూరుల్వెలయుదు రిల బద
     నీరేజరజఃకృతావనీసంత్రాణుల్.


ప్రతి పద్యమూ మొదట మూలశ్లోకము, తరువాత తెలుగు పద్యము, దానివెంట తెలుగు వ్యాఖ్య, తరువాత ఆ శ్లోకంలోని అలంకారములతో అందరికీ సరళంగా అర్థమయ్యేలా వ్రాశారు.

మొదట భరతుని స్తోత్రం చేయబడింది.


చం|| ధరణిని రామపాదుకల దక్షత కక్షయకీర్తిగూర్చె నే
      వరగుణశాలి, లోకమున భక్తవరేణ్యులకొజ్జబంతియై
      వరలునెవండొ, యెవ్వడనివార్య నిజాగ్రజ భక్తియుక్తుడా
      భరతుని గొల్చెదం బరమభక్తి దదీయగుణోపలభ్ధికై.


పాదుకాస్తోత్రములను రెండింటిని మీకోసం.


చం|| హరిపదరక్షలార! మిము నల్పుడ నే నుతియించి నంతలో
      దరుగునె మీ మహత్వ మిక దక్కు నమేయసుఖంబు నాకు, గు
      ర్కుర మమరాపగాజలము గ్రోలిన దద్ఘనతాప మాఱు, దు
      ర్భరసకలాఘనిర్హరణపాటవ మోటగునే మరున్నదిన్.
 


ఉ||   విన్నపమొండు రంగపతివిభ్రమపాదుక! భీతిచేత నే
      మున్నె యొనర్తు విన్ము, గుణపూర్ణులు పూర్ణకృపాత్తచిత్తసం
      పన్నులు సర్వదోషగుణమర్శనదర్శనవాచనక్షముల్
      నిన్ను నుతించు దీని గమనింతురు గాత గతాభ్యసూయులై.


ప్రతులకు:
శ్రీ వింజమూరి శేషఫణిశర్మ M.A., B.O.L (Sans),
ఇంటి నెం: జి 2, సాయి భార్గవి ఎపార్ట్‌మెంట్ - 3
బస్‌స్టాండు వెనుక, చిత్రావతీ రోడ్,
పుట్టపర్తి, అనంతపురం జిల్లా,
ఆంధ్రప్రదేశ్ 515134

ఫోన్: 94415 87493