27, ఏప్రిల్ 2011, బుధవారం

ముదిగెరేపుర దేవర చెన్నకేశవా!

కరముల శంఖచక్రములు కంజదళాక్ష! గదాయుధమ్ము నీ
స్థిరమగు మందహాసమును చిన్మయరూపముఁ బ్రోచు హస్తమున్
కరుణనుఁ గాచుచుండునెడ కష్టము నష్టము లేమి పాపముల్
పరుగులుఁ బెట్టవే పతితపావన భావన చెన్నకేశవా! -11

పెనగొని లోకమంతయును పెంపుగఁ బ్రాకు ననంత దూరముల్
ఘనముగ దానినంతటిని గర్భమునందు ధరించి ప్రేమతో
కనుగొనిఁ గాచుచుండెదవు కంజదళాక్ష! యనంతకాలముల్
నినుఁ బొగడంగజాల డవనీధరుడైనను చెన్నకేశవా! -12

ఇమ్మహినెల్లఁ జేతనుల నీశ్వరఁ! బ్రోతువు జాగృతుండవై
అమ్మవె నీవు! నాదు హృదయమ్మున మేల్కొనుమయ్య ప్రేమలన్
జిమ్ముచు నమ్ముకొంటి మది చీకటిఁ ద్రోలుము శాశ్వతమ్ముగా
లెమ్ము మనమ్మునన్ ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -13

పదములఁ బుట్టి గంగ కడుపావని శంభుశిరమ్ముఁ జేరె నీ
పదములఁ బట్టి తా కడిగి బ్రహ్మ సృజించె ననంత విశ్వమా
పదములఁ బట్టువారి ఘనపాదసమాశ్రయభాగ్యమిమ్ము భూ
రిదయ దయామయా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -14 

మ్రొక్కెద నారదాది మునిముఖ్యులు వేల్పులు యెల్లవేళలన్
దిక్కనిఁ గొల్చు పాదమును దిక్కులనన్నిటినొక్క యంగలో
గ్రక్కున
గొల్చు పాదమును రక్కసిరాజునుఁ ద్రొక్కివైచి పే
రెక్కిన పాదమున్! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా!
-15 


ఇడుములువేలుకల్గెనని యీసటఁ జెందక నోర్మికల్గి నిన్
సడలని భక్తిఁగొల్చి భవసాగరపారముఁ జేరి ముక్తుడై
కడకనరాని దివ్యపథగామినియౌచు ననంత! నిన్నుఁ జే
రెడి కృప నీడవే! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -16


అన్యమెరుంగనయ్య భవదంఘ్రిపదమ్మునకన్న మిన్నగా
ధన్యుని జేయు స్థానమును దైత్యుల గూలిచి భక్తకోటికిన్
దైన్యము బాపు ధానమును ధర్మనిబంధమునక్షరమ్ము కా
రుణ్యకబంధమున్ కనగ లోకమునందున చెన్నకేశవా! -17 


పంపితివంతకుంగడకు పౌరుష వైభవ మత్త దైత్యులన్
పెంపు వహించి పెంచితివి పేద కుచేలుని స్థాయి సంపదల్
తెంపరికెట్టులౌను భవదీయ కృతంబులనుద్యమించి వా
రింప పురంధరా! ముదిగెరే పురదేవర చెన్నకేశవా!  -18


వేకువ సేవసేసి తెర వేగమె తీయ జగమ్ములెల్లెడన్
చీకటి తీసివైచి విరజిమ్మెడు నీ ముఖకాంతి తీయుతన్
మాకవిభేద్యమైనవగు మాయతెరల్ మముఁ జేర్చుఁగాత నీ
శ్రీకర సన్నిధిన్ ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -19


ఇంతగు చిన్నియాశ జనియించి మనమ్మున నంతఁ బెద్దదై
యంతములేని కర్మచయమందున జీవునిఁ ద్రోయు నంతటన్
అంతములేని యాశలనడంగెడు మాకు భవాంఘ్రియుగ్మమూ
రింత గదయ్య యో ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! -20
 

 

17, ఏప్రిల్ 2011, ఆదివారం

మా ఇలవేల్పు ముదిగెరే శ్రీ చెన్నకేశవస్వామి దివ్య చరణారవిందములకు

శ్రీకమలాక్ష! నీదు పదసేవనొసంగి ప్రభాకరేందు తే                   
జోకర రూపమున్గనులఁ జూడగనిల్చి దిగంతమెల్లడన్
ప్రాకటమైన నీదు మధురామృతనామ మొసంగినావు శౌ
రీ! కరుణాలయా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 1


పంచనఁ జేరు గోపికల భాగవతాత్ముల తాపసేంద్రులన్                   
సంచిత పాపరాశి భవసాగరమున్ తరియింపఁ జేసి నీ
యంచిత పాదపంకజ సమాశ్రయమిచ్చుచుఁ బ్రోచురీతి పా
లించు ననున్ హరీ! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 2


ఒఱగును లోకమంతయును నొద్దిక నీ భుజమండలమ్ముపై
ఒఱిగితివీవటంచుఁ మము హోమములెన్నియొ జే
సిఁ బుణ్యముల్
తఱుఁగని రీతిఁ బొందగ నుదారత జేసెడు నీదు లీల లే
రెఱిఁగెడి వారలో! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 3


మించెడు గౌరవంబు శృతిమించెడు హేళన న్యూన భావముల్
ఎంచగరాని సంపదలు హింసలొసంగెడి లేమి కష్టముల్
వంచగరాని మాయలజవందితఁ ద్రుంచు కృపేక్షణంబు సా
రించి నలేక్షణా! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 4 


మును వనజాసనుండు తన మూలమెరుంగగ నెంచిఁ బోయినన్
కనుగొనజాలడయ్యె చిరకాలము తామరతూటివెంట తా
ననితర భక్తియోగమున నచ్యుతఁ! జేరెను నీ పదంబులన్
ఘనమగు భక్తిఁగాక నినుఁ గానగ శక్యమె చెన్నకేశవా! - 5


రాతిని నాతిఁ జేసితివి ప్రాణముఁ బోసి దయార్ద్రబుద్ధితో
కోతికనుగ్రహించితివి కోరక బ్రహ్మపదంబు ప్రేమతో
ప్రీతిగ
నెంచితా యుడుత ప్రేమను సేవయు, నమ్ము మమ్మునే
రీతిగఁ బ్రోతువో! ముదిగెరేపుర దేవర చెన్నకేశవా! - 6


ఉగ్రత దుష్టదానవుని యుక్కడగించి ప్రసన్నవీక్షణా
నుగ్రహలీల దానవతనూజుని ప్రేమ నృసింహమూర్తివై
అగ్రసుపూజ్య! బ్రోచుగతి నంతముఁ జేయుమఘంబు లాగ్రహా
నుగ్రహవిగ్రహా!కను మనోహర దృక్కులఁ జెన్నకేశవా!
 - 7 


పిల్లనగ్రోవియే మరుని విల్లయి వేణురవమ్ములమ్ములై 
యుల్లము దోచుచుండ మదినొల్లక నీ విరహమ్ము వేడినన్
గొల్లెతలెల్ల భామినుల
నొక్కరి కొక్కడి వౌచుఁ బ్రోచు నీ
చల్లని చూపులొక్కపరిఁ జల్లుము నాపయి చెన్నకేశవా! - 8


సాక్షివి సర్వజీవులకు సారమ నీవయ వేదరాశికిన్
మోక్షపదంబు నీవయ ముముక్షువుఁ బోదగు దారి నీవె స
ర్వేక్షణ! దర్శనంబిడు ముపేక్షను మాని సహింప నోప శౌ
రీ! క్షణమాత్రమున్ ముదిగెరేపురదేవర చెన్నకేశవా! -9 


అందెలు ఘల్లుఘల్లుమన ఆడెను నందుని నందనుండు వా
తంధయునౌదలమ్ముపయి తాండవనృత్యము! వేగరండు, గో
విందుని నాట్యలీల కనువిందుగఁ జూతుమటంచుఁ జేరువా
రిం దలపోతునో! ముదిగిరేపురదేవర చెన్నకేశవా! - 10